త్వరలోనే నగరవనం ప్రారంభించేలా ప్రయత్నం చేస్తున్నాం – కళ్యాణదుర్గం నగరవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు..

అనంతపురం, జూన్ 16 :

కళ్యాణదుర్గం పట్టణం వద్దనున్న నగరవనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలోని నగరవనం అంతా కలియదిరిగి పరిసరాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ శాఖ ఆధ్వర్యంలోని నగరవనంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కీంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొంతకాలం నుంచి ఇక్కడ పనులు పూర్తి కావడం జరిగిందని, ఈరోజు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించడం జరిగిందని, త్వరలోనే నగరవనం ప్రారంభించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రులతోగానీ, ఎమ్మెల్యేలతో కలిసి ఖచ్చితంగా ప్రారంభించేలా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా నగరవరంలో కాటేజీలు లేదా మిగిలిన వసతులు, సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే డిఎంఎఫ్, విబిజి రాంజి స్కీంల కింద ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రెండు పథకాలలో అదనంగా అవసరమైన మౌలిక సదుపాయాలను అటవీ శాఖతో సమన్వయం చేసుకొని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో నగరవనం ఏర్పాటు ఈ ప్రాంతవాసులు అదృష్టంగా భావించాలన్నారు. నగరవనం చాలా బాగుందని, పర్యావరణం ఎక్కడ దెబ్బతినిపోకుండా అన్ని విధాలా సహజంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ రెండు మూడు రిసార్ట్స్ ఉంటే బాగుంటుందని జిల్లా కలెక్టర్ ని అడగడం జరిగిందని, ఖచ్చితంగా డిఎంఎఫ్ నిధులు లేదా విబిజి రాంజీ పథకాల కింద ఇవ్వడం జరుగుతుందని తెలిపారన్నారు. ఉప ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తున్నామని, ఆయన చేతుల మీదుగా నగరవనం ప్రారంభించాలనేది తమ ఆశ, ఆకాంక్ష అని, ఆయన రాక ఆలస్యమైనట్లయితే జిల్లాకు చెందిన మంత్రులతో ప్రారంభించేలా చూసి ప్రజలకు నగరవనం అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంత వాసులకు ఇలాంటి పార్క్ ఎక్కడా లేదని, పట్టణానికి అందుబాటులో అద్భుతంగా నగరవనం కట్టారన్నారు. ఇది చాలా గొప్ప విషయమని, అటవీశాఖ అధికారుల కృషి కూడా ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor