సింగరేణి బొగ్గు కుంభకోణంపై గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు: సీబీఐ విచారణకు డిమాండ్!

సింగరేణి సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ (CBI) తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని, అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి పాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను మళ్లీ తెరపైకి తెస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు సింగరేణి టెండర్లలో ప్రాధాన్యత ఇస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా ‘సృజన్ రెడ్డి’ అనే వ్యక్తికి ఈ వ్యవహారంలో ఉన్న సంబంధంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే, ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడి (మెస్సీ) కార్యక్రమం కోసం సింగరేణి కార్మికుల కష్టార్జితమైన రూ.10 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సింగరేణితో పాటు హైదరాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక భూముల విషయంలో కూడా ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘హిల్ట్ పాలసీ’ పేరుతో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరుల ప్రయోజనాల కోసమే ఈ విధానాలను రూపొందిస్తున్నారని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని విన్నవించారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Editor