శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం, పాముదుర్తి గ్రామంలో గల శ్రీ చెన్నకేశవ దేవాలయ ప్రాంగణంలో ఘనంగా హోమియోపతి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ గిరీష్ మరియు డాక్టర్ పద్మావతి గారు సంయుక్తంగా ప్రారంభించారు. గ్రామస్తులకు హోమియోపతి వైద్య విధానంపై అవగాహన కల్పిస్తూ, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు.
ఈ వైద్య శిబిరంలో భాగంగా వందలాది మంది గ్రామస్తులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన హోమియోపతి మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి హోమియోపతి చికిత్స ద్వారా కలిగే ప్రయోజనాలను డాక్టర్ గిరీష్ వివరించారు. దేవాలయ ప్రాంగణంలో ఈ శిబిరం నిర్వహించడంతో భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ గిరీష్, పద్మావతిలతో పాటు డాక్టర్ సింధు, అనురాధ, మరియు మోహన్ నాయుడు గారు మెడికల్ సిబ్బందితో కలిసి రోగులకు సేవలందించారు. గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఇటువంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. వైద్య బృందం చేసిన ఈ సేవను పాముదుర్తి గ్రామ ప్రజలు అభినందించారు.
