తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తోందని, భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే సమయం తప్పకుండా వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశం ఉన్న ప్రతిచోటా బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ పదవులు ఇస్తున్నామని ఆయన వివరించారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ వారి వాటా దక్కుతుందని, రాబోయే రోజులు బీసీలవే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తమ ధ్యేయమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందని, అదే ఉత్సాహంతో మున్సిపల్ పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కుల గణన మరియు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా కాంగ్రెస్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఇదే క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం దేశానికి ఏమాత్రం మంచిది కాదని, రాముడు, ఆంజనేయుడి పేర్లు చెప్పి బీజేపీ ఓట్లు దండుకుంటోందని విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం ‘జై శ్రీరాం’ నినాదంతో ప్రజలను మభ్యపెట్టవద్దని, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా తాను చేసిన పనులేంటో అర్వింద్ వివరించాలని ఆయన సవాల్ విసిరారు.
