తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) నోటీసులు అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ట్యాపింగ్ అనేది పోలీసులు చేసే ప్రక్రియ అని, ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. దేశ భద్రత లేదా ప్రభుత్వ అస్థిరత వంటి కారణాలతో పోలీసులు నిఘా ఉంచడం సాధారణమేనని, ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని తాము అడగమని స్పష్టం చేశారు. ఒకవేళ విచారణ చేయాలనుకుంటే నాటి మరియు నేటి డీజీపీలకు నోటీసులు ఇవ్వాలని, పోలీసుల తప్పిదాలకు రాజకీయ నేతలను బాధ్యులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సిట్ విచారణ తీరును కేటీఆర్ ఎద్దేవా చేస్తూ.. ఇది ఒక నిరంతర ‘కార్తీక దీపం’ సీరియల్‌ను తలపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే హరీష్ రావును, ఇప్పుడు తనను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తన ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని ఆరోపించిన ఆయన, తనపై నిఘా లేదని అధికారులు ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు.
కాగా, శుక్రవారం (జనవరి 23, 2026) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలతో కేటీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనను కేవలం సాక్షిగా కాకుండా, ఈ కుట్ర వల్ల ప్రయోజనం పొందిన వ్యక్తిగా పోలీసులు పరిగణిస్తున్నట్లు సమాచారం రావడంతో, రేపటి విచారణపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
