తెలంగాణలోని ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం జాతరలో యువ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు ‘బంగారం’ (బెల్లం) తో తులాభారం వేయడం తీవ్ర చర్చకు దారితీసింది. పమేరియన్ జాతికి చెందిన తన కుక్కతో కలిసి మేడారం వచ్చిన ఆమె, అక్కడ భక్తులు మొక్కులు తీర్చుకునే విధంగానే కుక్క బరువుకు సమానంగా బెల్లాన్ని తూకం వేసి అమ్మవార్లకు సమర్పించారు. గిరిజన దేవతలను కొలిచే పవిత్ర స్థలంలో ఇలా జంతువులకు తులాభారం వేయడంపై భక్తులు మరియు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో టీనా శ్రావ్య తక్షణమే స్పందించారు. తన పెంపుడు కుక్క తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో, అది కోలుకుంటే అమ్మవార్లకు మొక్కు చెల్లిస్తానని అనుకున్నానని ఆమె వివరణ ఇచ్చారు. తన ఉద్దేశం కేవలం మొక్కు తీర్చుకోవడం మాత్రమేనని, గిరిజన సంప్రదాయాలను లేదా భక్తుల విశ్వాసాలను కించపరచాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. మూగ జీవాల పట్ల ఉన్న ప్రేమతోనే ఈ పని చేశానని ఆమె పేర్కొన్నారు.
అయినప్పటికీ, తన చర్య వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. మేడారం జాతరలో ‘బంగారం’ అంటే బెల్లం అని, దానిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారని అందరికీ తెలిసిందే. అయితే, సాధారణంగా మనుషులు తమకు తాముగా వేసుకునే ఈ తులాభారాన్ని కుక్కకు వేయడం సంప్రదాయ విరుద్ధమని గిరిజన పూజారులు అభిప్రాయపడ్డారు.
