మేయర్ పీఠంపై పీఠముడి: బీఎంసీలో మొత్తం 227 స్థానాలు ఉండగా, అధికార పక్షం మెజారిటీ మార్కును (114) దాటింది. అయితే, అత్యధికంగా 89 స్థానాలు గెలుచుకున్న బీజేపీ మేయర్ పీఠం తమదే అని భావిస్తుండగా, 29 స్థానాలు సాధించిన షిండే వర్గం తాము లేకుండా అధికారం సాధ్యం కాదని పట్టుబడుతోంది. ముంబైలో మేయర్ పదవి శివసేన వారసత్వమని, కాబట్టి ఆ పదవి తమకే దక్కాలని షిండే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.
కార్పొరేటర్లకు రిసార్ట్ కాపలా: ప్రతిపక్ష ఉద్ధవ్ ఠాక్రే వర్గం, కాంగ్రెస్ కూటమికి 106 స్థానాల బలం ఉంది. వీరు మరో 8 మంది కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుంటే మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉండటంతో, షిండే అప్రమత్తమయ్యారు. ఫిరాయింపుల భయంతో గెలిచిన తన పార్టీ కార్పొరేటర్లందరినీ ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించారు. ఈ రిసార్ట్ రాజకీయాలు ముంబై మేయర్ ఎన్నికలో ఎటువంటి ఉత్కంఠకు దారితీస్తాయోనన్న చర్చ మొదలైంది.
బేరసారాలు – థానే వర్సెస్ ముంబై: థానే మున్సిపల్ కార్పొరేషన్‍లో షిండే సేన ఒంటరిగానే మెజారిటీ సాధించింది. దీంతో థానేలో షిండేకు మేయర్ పదవి ఇచ్చి, ముంబైలో బీజేపీకి అవకాశం ఇస్తారా? లేదా ముంబై మేయర్ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకుంటారా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీపై పట్టు సాధించేందుకు రెండు పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
