Latest Posts

ముదిగుబ్బలో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు..

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1807జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామంలో వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన వడ్డే ఓబన్న బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వడ్డే ఓబన్న, వడ్డెర, బోయలు, చెంచుల వంటి సంచార తెగలను సమీకరించి సైన్యాధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. 1857 సిపాయి తిరుగుబాటుకు ముందే దక్షిణ భారతదేశంలో జరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటంలో ఆయన విశేష సేవలందించారు. నరసింహారెడ్డి అనుచరులను సమీకరించి సుమారు 2000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, బ్రిటిష్ ఖజానాను దోచుకోవడం, తహసీల్దారు హత్య వంటి సంఘటనల్లోనూ కీలకంగా వ్యవహరించారు. 1846 అక్టోబర్ 6న కర్నూలు జిల్లా పేరుసోముల కొండపై జరిగిన యుద్ధంలో వడ్డే ఓబన్న వీరమరణం పొందారు.
వడ్డే ఓబన్న సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 నుంచి జనవరి 11న ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు (జనవరి 11, 2026) రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ముదిగుబ్బ నందు గ్రామపంచాయతీ కార్యాలయం–1లో స్థానిక వడ్డెర సంఘం నాయకులు ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో నారాయణస్వామి, ముదిగుబ్బ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ పాల్గొని వడ్డే ఓబన్న చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తుచేశారు. యువత ఆయన సేవలను ఆదర్శంగా తీసుకొని దేశభక్తిని పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు.

Posted Under AP
Editor