పండుగలా వేమన జయంత్యుత్సవాలు: లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

పండుగలా…
వేమన జయంత్యుత్సవాలు
– రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరండి
– జయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
– ఎమ్మెల్యే ‘కందికుంట’కు అభినందనలు

జనవరి 10 (విజయవాడ):
మానవీయ విలువలను తన పద్యాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ఆధ్యాత్మిక, సంఘసంస్కర్త, ప్రజా కవి వేమన జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉదయం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్ లో వేమన రాష్ట్రస్థాయి జయంత్యుత్సవాల లోగోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తాలూకా కటారుపల్లి వేమన సమాధి వద్ద జరిగే ఈ ఉత్సవాలు ప్రజల ఆలోచనా విధానంలో గొప్ప మార్పు తీసుకొస్తాయన్నారు. కదిరి చరిత్రలో గుర్తుండిపోయేలా పండుగలా ఉత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వేంకటప్రసాద్ మాట్లాడుతూ వేమన కుల, మతాలకు అతీతంగా మనుషుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు పద్య ప్రక్రియను ఆయుధంగా ప్రయోగించారన్నారు. అతిరథ మహారథులైన విద్య, కళా, రాజకీయ, సామాజిక, సాహితీ రంగాల మేధావులు వేమన ఉత్సవాలకు హాజరవుతున్నారని, రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు వేల సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో సాహితీ పరిశోధకుడు డాక్టర్ ఉద్ధండం చంద్రశేఖర్, గాయకుడు మదిగుబ్బ (సుధాకర్ ఈటీవీ పాడుతా తీయగా ఫేమ్), ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పట్నం రమణ, ఏఐ డెవలపర్ తేజస్విని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గౌతమి పాల్గొన్నారు.

Posted Under AP
Editor