నల్లమాడ మండలం నల్ల సింగయ్య గారి పల్లి గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయి అనే బాలిక ప్రమాదవశాత్తు స్థానిక సింగనయ్య కుంట వద్ద ఉన్న చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామం మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి.
స్థానికుల సమాచారం ప్రకారం, బాలిక నీటిలో పడిపోవడాన్ని గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే నల్లమాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బాలిక మృతదేహాన్ని చెరువు నుండి వెలికి తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. బాలిక ప్రమాదవశాత్తు నీటిలో పడిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెరిగిన కూతురు కళ్ళముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
