ముదిగుబ్బ జనవరి 5: (YES 9TV): బ్రహ్మదేవరమర్రిలో E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ముదిగుబ్బ మండలం బ్రహ్మదేవరమర్రి గ్రామంలో శుక్రవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని రీ-సర్వే డిప్యూటీ తాసిల్దార్ పి. గంగన్న గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ గారు చేతుల మీదుగా రైతులకు E-పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తప్పులు తడకగా నిర్వహించిన రీ-సర్వే ప్రక్రియను ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిదిద్దుతూ, రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కొత్తగా జారీ చేసిన E-పాస్ పుస్తకాల్లో రైతు పొలానికి సంబంధించిన మ్యాప్, సమగ్ర భూ వివరాలు, అలాగే QR కోడ్ ని పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో భూమి సంబంధిత వివరాలు పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉంటాయని అన్నారు.
అలాగే ఈ రీ-సర్వే ప్రక్రియలో పాత పద్ధతిలో గొలుసులతో చేసిన సర్వేకు బదులుగా ఆధునిక డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి భూములను రీ-సర్వే చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా గత సర్వేతో పోలిస్తే ప్రస్తుతం సర్వేలో 2 నుంచి 5 శాతం వరకు తేడా వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ పరిమితిని మించి వ్యత్యాసం ఉన్నట్లయితే, సంబంధిత రైతులు వెంటనే తాసిల్దార్ కార్యాలయానికి అర్జీ రూపంలో వినతి పత్రం సమర్పించాలని రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మదేవరమర్రిలో E-పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: ఆధునిక సాంకేతికతతో భూ రికార్డుల ప్రక్షాళన
