సూక్ష్మ సేద్యంతోనే రైతులకు అధిక లాభాలు
– ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ
– ఏడేళ్లు దాటిన వారికి మళ్ళీ డ్రిప్ పొందే అవకాశం
– కలెక్టరు సుమిత్ కుమార్
సూక్ష్మ సేద్యంతోనే రైతులకు అధిక లాభాలు వస్తాయని…. ఆధునిక సాగునీటి పద్ధతులను అవలంబించడం ద్వారా ఉద్యానవన రైతులు తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించవచ్చని, తద్వారా వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలుపై వివిధ కంపెనీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ… రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలు అందజేస్తోందన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించడానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీ… ఇతర రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీ లభిస్తోందన్నారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ కోసం అన్ని వర్గాల రైతులకు 50 శాతం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. గతంలో డ్రిప్ ఇరిగేషన్ పొంది 7 సంవత్సరాలు పూర్తయిన రైతులు మళ్ళీ కొత్తగా డ్రిప్ వ్యవస్థను పొందేందుకు అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 31 మండలాల్లో సూక్ష్మ సేద్యం విస్తరణపై కలెక్టర్ గణాంకాలను వెల్లడించారు. ఇప్పటివరకు 1,30,647 హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయగా, 1,32,629 మంది రైతులు ప్రయోజనం పొందారన్నారు. జిల్లాలో ఇంకా 95,752 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని… దీనిపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు వంటి ప్రాంతాల్లో కూరగాయలు, పూల సాగుకు ఈ విధానం ఎంతో మేలని కలెక్టర్ తెలిపారు. అలాగే చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి ప్రాంతాల్లో మామిడి తోటలకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నాణ్యమైన దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీటిని పొదుపు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ పి.వి. రమణ, ఏపీడీ ఫజురునిషా, ఎంఐడీసీ నరేష్, వివిధ మైక్రో ఇరిగేషన్ కంపెనీల అధికారులు పాల్గొన్నారు.
