తిరుపతి నగరంలో స్థానిక ప్రజలు, భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఈట్ స్ట్రీట్’ (ఫుడ్ కోర్ట్) ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుతం రూ.80 లక్షల బడ్జెట్‌తో చేపడుతున్నారు. ఈ ఫుడ్ కోర్ట్‌ను నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయలు మార్గంలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ నూతన ఫుడ్ కోర్ట్‌ను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ మొత్తం 40 నుంచి 50 ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టాళ్లలో 12 స్టాళ్లను 8/16 సైజులో ఉన్న కంటైనర్లను ఫుడ్ స్టాళ్లుగా మార్చి ఉపయోగిస్తారు. మిగిలిన స్టాళ్లను టెండర్ల ద్వారా కేటాయించి, టెండరుదారుతో ఏర్పాటు చేయిస్తారు.
తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ఈ ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ ప్రారంభమైతే తిరుపతి వాసులకు, సందర్శకులకు రుచికరమైన ఆహారాన్ని ఒకే చోట ఆస్వాదించే అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తిరుపతి కమిషనర్ చొరవ తీసుకుంటున్నారు.
