బీజే సింగ్ అరెస్టు: తండ్రితో గొడవపడి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి అస్సాం యువకుడు

అస్సాం రాష్ట్రానికి చెందిన బీజే సింగ్ అనే 31 ఏళ్ల భారతీయుడిని సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించినందుకు పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బీజే సింగ్ పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన మూడు నెలల క్రితం ఆగస్టు 16న జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సరిహద్దు ప్రాంతంలో బీజే సింగ్ అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. బీజే సింగ్ దాదాపు 100 రోజులుగా తమ ఆధీనంలోనే ఉన్నాడని వారు తెలిపారు. విచారణ సందర్భంగా అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో లాహోర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసూర్ పోలీస్ స్టేషన్‌కు అతడిని అప్పగించారు.

విచారణలో బాధితుడు తన తండ్రి బర్షన్ సింగ్‌తో కుటుంబ కలహాల కారణంగా గొడవపడి ఇంటి నుంచి వచ్చానని వెల్లడించినట్లు సమాచారం. అయినప్పటికీ, పాకిస్థాన్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు బీజే సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాక్ అధికారులు ధృవీకరించారు.

Editor