పైరసీకి చెక్ పడలేదు: ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ‘iBomma One’ ప్రత్యక్షం

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీకి చెక్ పడినట్లేనని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. తాజాగా ఆన్‌లైన్‌లో మరో పైరసీ సైట్ ‘ఐ బొమ్మ వన్‌’ (iBomma One) పేరుతో ప్రత్యక్షమైంది. అందులో కొత్త సినిమాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా మూవీ లింక్‌ను క్లిక్ చేస్తే, అది నేరుగా ‘మూవీ రూల్జ్’ (MovieRulz) వంటి ఇతర పైరసీ సైట్‌లకు రీడైరెక్ట్ అయిపోతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో, రవి అరెస్ట్ తర్వాత కూడా పైరసీ నెట్‌వర్క్ ఆగకపోవడంతో, పోలీసులు ఈ కొత్త సైట్‌పై దృష్టి సారించారు. ఐబొమ్మ వ్యవస్థలో రవి ఏకంగా 65 మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహించినట్లు సమాచారం. అందువల్లే, రవి అరెస్ట్ అయినా ఆ బ్యాకప్ నెట్‌వర్క్ ద్వారా ‘ఐ బొమ్మ వన్‌’ ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అందుకే, ‘మూవీ రూల్జ్’, ‘తమిళ్ ఎంవీ’ సైట్ల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసుల కస్టడీకి తీసుకోనున్నారు. రవిని ఫ్రాన్స్ నుంచి వచ్చిన సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రవి జీవితంలో జరిగిన వాస్తవాలు, అతని పోరాటాలపై సినిమా తీసేందుకు ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది.

Editor