ఐబొమ్మ రవి విచారణలో వెల్లడైన పైరసీ నెట్‌వర్క్ రహస్యాలు

ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ ద్వారా భారీ పైరసీ సామ్రాజ్యాన్ని సృష్టించిన నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో విచారణ తొలి రోజున సంచలన నిజాలను వెల్లడించినట్లు సమాచారం. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి అరెస్ట్ అయిన రవి, సాధారణ నేరస్థులకు భిన్నంగా తన మొత్తం పైరసీ నెట్‌వర్క్ గురించి పూస గుచ్చినట్లుగా వివరించాడట. పోలీసులు ప్రధానంగా రవి బ్యాంకింగ్ ఖాతాలపై, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా అతను కూడబెట్టిన డబ్బుపై ఆరా తీశారు. అలాగే, నెదర్లాండ్స్‌లో ఉన్న తన నెట్‌వర్క్ సర్వర్ల గురించి కూడా వివరాలు సేకరించారు.

రవి, సినిమా పైరసీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పోలీసులకు వివరించాడు. సినిమా రిలీజైన వెంటనే ఏజెంట్లు ఎలా రికార్డ్ చేస్తారు, ఆ తర్వాత వాటిని ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి క్వాలిటీ పెంచుతారు అనే విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంకా, సినిమా ప్రింట్ క్వాలిటీని బట్టి ఏజెంట్లకు పేమెంట్ ఉంటుందని, తన వద్ద సర్వర్లను హ్యాక్ చేసి రిలీజ్‌కి ముందే సినిమాని పైరసీ చేసే ఏజెంట్లు కూడా ఉన్నారని, వారికి అధిక మొత్తంలో పేమెంట్ ఇస్తామని రవి తెలిపాడు.

పైరసీని అడ్డుకోవడానికి అధికారులు ఒక లింక్‌ను బ్లాక్ చేసినా, ఐపీ అడ్రస్‌ను మార్చి మరో మిర్రర్ సైట్‌ను క్రియేట్ చేయడం మరియు ఒక సైట్ నుంచి మరో సైట్‌కు రీ డైరెక్ట్ కావడం వంటివన్నీ తన ఓన్ టెక్నాలజీతో చేసినట్లు రవి పోలీసులకు వివరించాడు. మొత్తంమీద, తొలి రోజు విచారణలో రవి పూర్తిగా సహకరించినట్లు సమాచారం. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏమిటంటే, రవి తరఫు న్యాయవాది రవిపై ఉన్నవి బెయిలబుల్ కేసులే అని, త్వరలోనే రవికి బెయిల్ వస్తుందని వ్యాఖ్యానించడం.

Editor