తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక అద్భుతమైన శుభవార్త. హైదరాబాద్ మహానగరం త్వరలో తన రెండో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సొంతం చేసుకోబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ‘ఫ్యూచర్ సిటీ’లో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ కొత్త స్టేడియం కేవలం మ్యాచ్‌లు నిర్వహించడానికి మాత్రమే కాకుండా, చారిత్రక క్రీడా వేదికలైన లార్డ్స్ (Lord’s), సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి దిగ్గజ స్టేడియాల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
రవాణా సౌకర్యాలు మరియు అనుసంధానం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని, రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఈ కొత్త స్టేడియాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాబోయే రెండు సంవత్సరాలలో ఈ స్టేడియాన్ని పూర్తి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాల గురించి అధ్యయనం చేయడానికి, మాజీ క్రికెటర్లతో కూడిన ఒక బృందం త్వరలో విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికగా ఉంది. ఈ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధీనంలో నిర్వహణ సాగుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రధాన వేదికగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఇప్పుడు ఇతర కార్యక్రమాలకు పరిమితమైంది. కొత్త స్టేడియం రాకతో హైదరాబాద్‌ను క్రీడా రాజధానిగా మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ ఆలోచనకు ఇది ఒక చిహ్నంగా నిలవనుంది.
