పాకిస్థాన్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో పాకిస్థాన్‌కు అక్రమ, రహస్య అణు కార్యకలాపాల సుదీర్ఘ చరిత్ర ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ అణు కార్యక్రమంపై మొదటి నుంచి ఉన్న అనుమానాలను ట్రంప్ వ్యాఖ్యలు బలపరిచేలా ఉన్నాయని భారత్ పేర్కొంది.
శుక్రవారం మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. “దశాబ్దాల తరబడి సాగుతున్న స్మగ్లింగ్, ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్, అణ్వస్త్ర వ్యాప్తి వంటివి పాకిస్థాన్ చరిత్రలో భాగమే. పాకిస్థాన్ రికార్డుకు సంబంధించిన ఈ అంశాలను భారత్ ఎప్పటినుంచో అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలను మేము గమనించాం” అని తెలిపారు. పాకిస్థాన్ అణ్వస్త్ర వ్యాప్తిని భారత్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టమైంది.
ఇటీవల సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియాతో పాటు పాకిస్థాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అందుకే అమెరికా కూడా గత 30 ఏళ్లలో తొలిసారిగా పరీక్షలు జరపాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశాలు భూగర్భంలో పరీక్షలు చేస్తున్నాయని, అందుకే తాము కూడా కచ్చితంగా పరీక్షించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
