మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఎన్నింటికి ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్నిటికి ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

 

భారీ నుండి అతి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్టు వాతావరణశాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ వరకు భారీవర్షాలు కురవనన్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు

ఇదిలా ఉంటే నేడు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే అదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.

 

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్

హన్మకొండ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, మెదక్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కాగా రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Editor