శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి 58 రోజులైంది. గత 58 రోజులుగా సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన రోజు టన్నెల్ లోపల ఎనిమిది మంది చిక్కుకోగా, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన బృందాలు రెండు మృతదేహాలను వెలికి తీయగలిగాయి. మిగతా ఆరుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగింది.
షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యం
58 రోజులపాటు తవ్వకాలు జరిపినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మారింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. దీంతో రెస్క్యూ బృందాలు షిర్ జోన్లో తవ్వకాలు అసాధ్యమని చెబుతున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. నోగో జోన్లో తవ్వకాలు తెలిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రెస్క్యూ ఆపరేషన్ లో 12 సంస్థల బృందాలు
ఎనిమిది రోజులుగా సుదీర్ఘంగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ లో కేవలం రెండు మృతదేహాలను వెలికి తీయగలిగారు. మార్చి 9వ తేదీన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22వ తేదీన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకు రాగలిగారు. మొత్తం దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు ప్రయత్నం చేసిన ఫలితం మాత్రం రాలేదు.
హైడ్రా, సింగరేణి, ఎన్డిఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ ఇలా నిపుణులైన వారంతా రంగంలోకి దిగిన మరో ఆరుగురి ఆచూకీని ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.
టన్నెల్ లోపల 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. ఇక టన్నెల్ లోపల 43 మీటర్లను డేంజర్ జోన్ గా గుర్తించి అక్కడకు ఎవరు వెళ్లకూడదని నిషేధ ప్రాంతంగా సూచించారు.
