ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరిగింది? జరుగుతోంది? సచివాలయంలో అగ్నిప్రమాదం వెనుక కారణమేంటి? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? కేవలం రెండో బ్లాక్‌లో మంటలు ఎగిసిపడడంపై పాత్ర సూత్రదారులు ఎవరైనా ఉన్నారా? ఇది ప్రమాదమా? లేదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో విచారణ మొదలైపోయింది.
ఏ బ్లాక్‌లో ఘటన జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్రి ప్రమాదం విషయం తెలియగానే ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అనుమానాలు ఎందుకు?
దాదాపు గంటన్నర పాటు సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే సచివాలయంలోని రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత, ఆర్థిక మంత్రి కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ కార్యాలయాలు ఉండడంతో చాలామందికి అనుమానాలు మొదలయ్యాయి.
విచారణ మొదలు
ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా? ఈ ఘటనపై హోంమంత్రి విచారణకు ఆదేశించడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అగ్నిప్రమాదం గురించి వెంటనే సీఎం, డిప్యూటీ సీఎంలకు సమాచారం ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రాథమికంగా ఓ అంచనా
ఎలుకలు వైర్లు కొరకడం వల్లే ఘటన జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అలర్ట్ అలారం ఎందుకు మోగలేదు? ఈ క్రమంలో ఘటనను గుర్తించడంతో కాస్త ఆలస్యమైంది. మంత్రుల పేషీలకు సమీపంలోని బాత్రూం దగ్గర బ్యాటరీ రూమ్‌లో ఉంది. అందులోనే ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.
మీడియాకు నో పర్మిషన్
సిబ్బంది అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. అదే అర్థరాత్రి గనుక ఈ ఘటన జరిగితే మరింత డ్యామేజ్ అయి ఉండేదని అంటున్నారు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో జరగడంతో మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా మిగతా సిబ్బంది అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. మీడియాకు లోపలికి అనుమతించలేదు. సచివాలయం సిబ్బంది ఇప్పుడే ఒకొక్కరుగా ఆఫీసులకు వస్తున్నారు. అధికారుల విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.