ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుచానూరులో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా పంపిణీ పథకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టారు. పైల్‌లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు. అంతేగాక, భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగులున్నాయని తెలిపారు. 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఏజీ అండ్ జీ సంస్థను అభినందిస్తున్నట్లు తెలిపారు.
దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి రావడాన్ని చూస్తున్నామన్నారు. ఇది చాలా మంచి పరిణామమన్నారు. గోదావరి బేసిన్‌లో 40 శాతం గ్యాస్ లభిస్తోందని చంద్రబాబు తెలిపారు.
మన రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులున్నాయని చంద్రబాబు చెప్పారు. హైవేలు, సముద్రతీరం, పోర్టులు, విమానాశ్రయాలున్నాయన్నారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు.