Latest Posts

రాష్ట్రంలో గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.1000 కోట్లు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని గ్రామీణ ర‌హ‌దారుల‌కు మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. రాష్ట్రంలో గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణానికి రూ.1000 కోట్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈ ర‌హ‌దారుల నిర్మాణానికి జనవరి నుంచి నెల‌కు రూ.150 కోట్ల చొప్పున జూన్ నెలాఖ‌రు నాటికి రూ.వెయ్యి కోట్లు విడుద‌ల చేయాల‌ని ఆర్థిక శాఖ అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

 

ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల‌పై స‌చివాయ‌లంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామీణ ర‌హ‌దారుల‌కు సంబంధించి సీఎం రేవంత్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కాలంలోని ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాక‌పోక‌ల‌కు అనుగుణంగా సింగిల్ లైన్‌, డబుల్ లైన్ రోడ్ల వెడ‌ల్పును నిర్ణ‌యించార‌న్నారు. ప్ర‌స్తుతం మారుమూల ప‌ల్లెల్లోనూ కార్లు, ట్రాక్ట‌ర్లు, ఇత‌ర నాలుగు చ‌క్రాల వాహ‌నాలు తిరుగుతున్నందున వాటి రాక‌పోక‌ల‌కు వీలుగా ఆయా ర‌హ‌దారుల కొల‌త‌ల‌ను పునఃనిర్వ‌చించాల్సి ఉంద‌ని స్పష్టం చేశారు.

 

ఆయా వాహ‌నాలు ఆటంకాలు లేకుండా సాగిపోయేందుకు వీలుగా ర‌హ‌దారుల‌ను నిర్మించాల‌న్నారు సీఎం రేవంత్. తండాలు, గూడేలను పంచాయ‌తీలు చేసినా వాటికి ర‌హ‌దారులు, పంచాయ‌తీ, పాఠశాల భ‌వ‌నాల నిర్మాణాల‌ను విస్మ‌రించార‌ని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తి పంచాయ‌తీకి బీటీ రోడ్డు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీటీ రోడ్డు లేని పంచాయ‌తీ ఉండ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పారు.

 

గ్రామాల నుంచి మండ‌లాల‌కు సింగిల్ రోడ్లు, మండ‌లాల నుంచి జిల్లా కేంద్రాల‌కు డ‌బుల్ రోడ్లు క‌చ్చితంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంత‌లు ప‌డిన ర‌హ‌దారుల‌కు వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ ఆదేశించారు. పంచాయ‌తీరాజ్‌, ఆర్ అండ్ బీ ర‌హ‌దారుల నిర్మాణ ప్ర‌మాణాల్లో తేడాలు ఉన్నాయ‌ని.. ఇక ముందు అలా ఉండ‌డానికి వీల్లేద‌ని సీఎం స్పష్టం చేశారు.

 

రెండు శాఖల పరిధిలోని ఒకే రకమైన నాణ్యతాప్రమాణాలతో నిర్మించాలని సీఎం రేవంత్ సూచించారు. వాహ‌నదారులు తాము ప్ర‌యాణించేది పీఆర్ రోడ్డా.. ఆర్ అండ్ బీ రోడ్డా అనే విష‌యాన్ని ప‌ట్టించుకోర‌ని.. కేవ‌లం ప్ర‌యాణం ఎలా సాగుతుంద‌నేది ప్ర‌ధాన‌మ‌న్నారు. అట‌వీ ప్రాంతాల్లోని గ్రామాల‌కు సైతం ర‌హ‌దారులు నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Editor