తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు ఆమోదం – కండీషన్స్ అప్లై..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల పైన దర్శనం, వసతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ నేతల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించాలని కోరుతున్నారు. దీని పైన తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ అభ్యర్ధన మేరకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సూచనతో టీటీడీ ఇక తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖల ఆమోదం పై నిర్ణయం తీసుకుంది.

 

ఇక నుంచి ఏపీతో పాటుగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల దర్శనం, వసతి కోసం ఇచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించాలని టీటీడీ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమలలో తమ లేఖలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు లేఖలు ఇచ్చేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ వచ్చారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు – రేవంత్ మధ్య తాజాగా ఇదే అంశం పైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు తిరుమలలో ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు.

 

సీఎం రేవంత్ అభ్యర్ధన మేరకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే స్వామి వారి దర్శనం.. వసతి, సేవల విషయంలో ఏపీ ప్రజా ప్రతినిధుల తరహాలోనే అవకాశం కల్పించాలని టీటీడీకి సూచించారు. దీంతో, టీటీడీ తాజాగా ఈ అంశం పైన నిర్ణయం వెలువరించింది. ఇక నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం హోదాలో ఉన్న వారు ఇచ్చే సిఫార్సు లేఖలను ప్రతీ వారం రెండు రోజుల పాటు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు వెసులుబాటు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలుకు నిర్ణయించారు. దీంతో, కొత్త ఏడాది నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతించనుంది.

Editor