Latest Posts

అల్లు అర్జున్ ఇష్యూ.. పీసీసీకి సీఎం సూచనలు..

అల్లు అర్జున్ ఎపిసోడ్ వ్యవహారం ముదురుతోందా? దీనికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రేపో మాపో టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నారా? ఈ ఎపిసోడ్‌పై నేతలు ఎవరూ మాట్లాడవద్దని సూచనలు చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

అల్లుఅర్జున్ ఎపిసోడ్‌ రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని మీడియా సైతం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. జరుగుతున్న వ్యవహారాలను సీఎం రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు, నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం, ఆపై మీడియాలో చర్చ దారితీయడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.

 

దీనిపై ఇండస్ట్రీ సైలెంట్ కావడంతో.. నేతలు సైతం నోరు ఎత్తకుండా ఉంటేనే బెటరని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీసీ మహేష్‌కుమార్ గౌడ్‌కు కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా సమావేశాలు, చర్చలకు దూరంగా ఉండాలన్నది అందులోని సారాంశం. పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని పీసీసీని ఆదేశించినట్టు తెలుస్తోంది.

 

అసెంబ్లీ సమావేశాల చివరి‌రోజు సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ల పెంపు ఉండదని ఓపెన్‌గా చెప్పేశారు. అదే రోజు సాయంత్రం నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.

 

ఇటు పోలీసులు.. మంత్రులు, నేతలు కౌంటర్ ఎటాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. పార్టీలోని నేతలంతా అల్లుఅర్జున్‌ను దుమ్మెత్తిపోశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో చర్చకు దారితీసింది. జరుగుతున్న పరిణామాలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై పీసీసీకి ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాల మాట.

Editor