కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారన్నారు. రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1000 కోట్ల విలువైన పనులు చేస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు.
టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలన్నారు. ఈ టెండర్ల అవినీతిపై కేంద్రానికి లేఖ రాశామని, ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతామని కేటీఆర్ అన్నారు. రూ.8,888 కోట్ల కుంభకోణాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారంలోనే కుంభకోణం ప్రారంభమైందని కేటీఆర్ అన్నారు. బావమరిది, తమ్ముళ్లకు అమృతం.. ప్రజలకు విషం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయని ధ్వజమెత్తారు. అమృత్టెండర్లలో సీఎం కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మరోసారి ఆరోపణలు చేశారు.
సీఎం బావమరిది సూదిని సృజన్రెడ్డి కంపెనీ శోధాకు ఎలాంటి అర్హతలు లేవు. ఐహెచ్‌పీ కంపెనీ ద్వారా టెండర్వేయించారు. కేవలం 20 శాతం మాత్రమే చేస్తామని ఐహెచ్‌పీ లేఖ రాసింది. 80 శాతం సీఎం బావమరిది చేస్తారట. ఐహెచ్‌పీని శిఖండిలా వాడుకొని రేవంత్రెడ్డి, సృజన్రెడ్డి అక్రమాలకు తెర లేపారని కేటీఆర్ ఆరోపించారు.
1982 అవినీతి నిరోధక చట్టం సెక్షన్7,11,13 ప్రకారం సీఎం, ప్రజాప్రతినిధులు తన కుటుంబ సభ్యుల కోసం ఆశ్రిత పక్షపాతం చూపుతూ అధికార దుర్వినియోగం చేస్తే ప్రాసిక్యూట్చేయవచ్చని చెబుతోంది. ఈ చట్టం ప్రకారం గతంలో సోనియా గాంధీ పదవులు కూడా కోల్పోయారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఇదే పరిస్థితి వచ్చిందని, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్చవాన్కూడా రాజీనామాలు చేశారని కేటీఆర్చెప్పుకొచ్చారు.
అమృత్పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేదని, ఫిబ్రవరిలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకపోతే కేంద్రం టెండర్లు రద్దు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్చేశారు. ఆధారాలు బయటపెడుతున్నామని కేంద్రం మౌనంగా ఉంటే రేవంత్రెడ్డితో పూర్తి అవగాహన ఉన్నట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సీబీఐ, ఈడీ, సీవీసీ ఎవరైనా విచారణ చేపట్టి ప్రజాధనం కాపాడుకోవాలని అన్నారు. కేంద్రం విచారణ జరిపిస్తే అన్ని అంశాలు బయటకు వస్తాయన్నారు.
