హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని నిర్ణయం.

 

హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించాం. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై రప్పిస్తున్నాం. 169 మంది అధికారులు, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కేటాయింపు చేసినట్లు మంత్రులు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్‌లో విలీనం చేస్తున్నట్లు తెలిపారు.

 

ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం ఆలైన్మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు. ఆర్అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ. కమిటీ కన్వీనర్‌గా ఆర్అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. మనోహరాబాద్ లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

 

3 వేలకుపైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్

 

8 మెడికల్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, 3 వేలకుపైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్ కు 34 మంది సిబ్బంది మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కోస్గి ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీలు మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రులు వెల్లడించారు.

 

రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు, టెక్స్ టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేందుకు రేవంత్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు రూ. 4637 కోట్లు మంజూరు చేయడంతోపాటు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు, ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్పీకి అదనంగా రూ. 500 చెల్లించి సన్నాలు కొనుగోలు చేయాలని నిర్ణయం. ఈ ఖరీఫ్‌లో 1.43 లక్షల టన్నుల పంట వస్తుందని అంచనా వేశారు. ఇక, అక్టోబర్ నుంచి కొత్తగా తెల్ల రేషన్ కార్డుల జారీ చేయడంతోపాటు జనవరి నుంచి అన్ని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని మంత్రులు వెల్లడించారు.

Editor