02-08-2024 (అనంతపురం)క్రమశిక్షణ కలిగినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని, సామాజిక అంశాలపై న్యాయ విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జి. శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ విజయనగర న్యాయ కళాశాలలో మాదకద్రవ్య నిరోధక చట్టం ర్యాగింగ్ నిరోధక చట్టం లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్రమశిక్షణ రాహిత్యం వల్ల వ్యక్తి వికాసాన్ని కోల్పోయి నేరాలకు పాల్పడే ప్రమాదం ఏర్పడుతుందని, మాదక ద్రవ్య వినియోగం కూడా అందులో ఒకటని న్యాయమూర్తి అన్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థి భవిష్యత్తు అంధకారం అవుతుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఏ. రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీ విజయనగర న్యాయ కళాశాలలో మౌలిక సదుపాయాలను విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని, ఇతర కళాశాల విద్యార్థులకు మార్గదర్శకం కావాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హెచ్ రాఘవేంద్ర చార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఇంటి పెద్దల సంరక్షణ కరువైన సందర్భాల్లో యుక్త వయసు యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని అన్నారు. కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమ్య మాదకద్రవ్య నిరోధక చట్టంలోని అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయమూర్తి జీ శివప్రసాద్ యాదవ్ కళాశాలలోని లైబ్రరీ, నమూనా న్యాయస్థానం, లీగల్ ఎయిడ్ క్లినిక్ లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం మహేష్, డిఫెన్స్ లీగల్ ఎయిడ్ సిస్టం డిప్యూటీ చీఫ్ కౌన్సిల్ పి పెద్దన్న, సీనియర్ న్యాయవాది జి. నరసింహులు, అధ్యాపకులు ఆర్ కల్పన, జే. సోనీ, పివి నిర్మల దేవి, నాగరాజు, శివ శంకర్ రెడ్డి, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.
