ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం వల్ల ఏపీ చాలా వెనుకపడిపోయిందని గవర్నర్ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, సభను వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. సభ వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్‌ను ఆయన ఛాంబర్‌లో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంలో మంత్రి లోకేష్ ,బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. చాలామంది వైసీపీ నేతలు బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, పార్టీలో చేరికలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు మంత్రి నారా లోకేష్‌కు తెలియజేశారట. పార్టీలో చేరికపై ఉమ్మడిగా నిర్ణయిద్దామని.. లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట బీజేపీ నేతలు. వైసీపీ నేతలు బీజేపీలో చేరికపై కూటమి నేతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని లోకేష్ ముందుంచారట బీజేపీ నేతలు.
దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ..ఈ ప్రతిపాదన మంచిదని, ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత దృష్టికి కూడా తీసుకువెళ్తామని బీజేపీ నేతలకు ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు బీజేపీలో చేరుతున్నారంటూ వస్తోన్న వార్తలపై సైతం ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయితే, తనకు తెలిసి తోట త్రిమూర్తులు చేరిక గురించి ఎటువంటి సమాచారం లేదని సత్య కుమార్ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో నారా లోకేష్, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, మంత్రి సత్యకుమార్‌లతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు టీడీపీలోకి కాకుండా ఇలా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపించడంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
