ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ పై దాడి కేసులో రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొన్నారు. కేసులో ఏ వన్ అయిన సతీష్ రిమాండ్ రిపోర్టులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న LW 8, LW 9 సమాచారంతో గుర్తించామన్నారు.
రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అంతేకాదు కాల్ డేటా లోను, సీసీటీవీ ఫుటేజ్ లోను నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్టు నిర్ధారించినట్లు తెలిపారు. అన్ని ఆధారాలను సేకరించిన తర్వాతే నిందితుడిని అరెస్టు చేశామని, ఈనెల 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి, అతని మొబైల్ ఫోన్ సీజ్ చేశామని పేర్కొన్నారు. వైయస్ జగన్ హత్య చేసేందుకే రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను పేర్కొన్నారు.
సున్నితమైన తలభాగంపై దాడి అందుకే సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద నుంచి తీసుకుని వచ్చాడని, అతని దాడి వెనుక హత్య ఉద్దేశమే ఉందని పేర్కొన్నారు. నిందితుడు ముందుగా పథకం వేసుకుని ఆపై దానిని వెల్లడించారు. కేసులో ఏ 2 ప్రోద్బలంతో కుట్ర చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు.
నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు ఘటన జరిగిన రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గరకు జనంతో కలిసి చేరుకున్న నిందితుడు ఆపై జగన్ పై రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించిన పోలీసులు నేరం తీవ్రతను బట్టి హత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
12 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదు మొత్తం ఈ కేసులో 12 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు వెల్లడించారు. అన్ని సాక్ష్యాలు, ఆధారాలు సేకరించిన తర్వాతనే ఏ 1 గా సతీష్ ను, ఏ 2 గా దుర్గారావు పేర్లను చేర్చినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
