ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే పది మంది అభ్యర్దుల జాబితా ప్రకటించింది. బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరిలో కీలక నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత సీటు బీజేపీకి వెళ్లింది. దీంతో, ఆయన కీలక ప్రకటనకు సిద్దమయ్యారు.
బీజేపీకి అనపర్తి సీటు తూర్పు గోదావరిలో బీజేపీకి పొత్తులో భాగంగా అనపర్తి సీటు కేటాయించారు. ఈ సీటును తొలుత టీడీపీ తీసుకుంది. అక్కడ నుంచి తమ అభ్యర్దిని రామకృష్ణారెడ్డి ప్రకటించింది. రామకృష్ణారెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో రాజకీయంగా పోరాటం చేసారు. పలు సందర్భాల్లో ఇద్దరు నేతల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈ సారి ఎలాగైనా నియోకవర్గంలో గెలిచేందుకు రామకృష్ణారెడ్డి వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. ప్రచారం ప్రారంభించిన తరువాత ఇప్పుడు ఈ సీటును బీజేపీ నేత శివ క్రిష్ణంరాజుకు ఖరారైంది. తనకు సీటు, కేటాయించి తిరిగి బీజేపీకి ఇవ్వటం పైన రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
రామకృష్ణారెడ్డి మనస్థాపం అనపర్తిలో బీజేపీకి ఎలాంటి బలం లేదని, ఆ సీటు కమలం పార్టీకి ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వటం ద్వారా…రాజమండ్రి ఎంపీ సీట పైన ప్రభావం పడుతుందని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అనపర్తి లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తరువాత బీజేపీ అభ్యర్దిని బరిలోకి దింపటం సరికాదనేది రామకృష్ణారెడ్డి మద్దతు దారుల అభిప్రాయం. దీంతో, టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన మద్దతు దారులతో సమావేశం కానున్నారు. ఆ సమావేశం తరువాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మారుతున్న సమీకరణాలు ఇటు రామకృష్ణారెడ్డి తో టీడీపీ ముఖ్య నేతలు మంతనాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వచ్చిందని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దీంతో, హోరా హోరీగా మారిన గోదావరి జిల్లా రాజకీయంలో ఇప్పుడు రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి రెబల్ గా పోటీ చేస్తారా…టీడీపీలోనే కొనసాగుతూ బీజేపీ అభ్యర్దికి సహకారం అందిస్తారా అనేది ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో, బీజేపీ సీట్ల ఖరారు తరువాత గోదావరి జిల్లాల్లో సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
