వైసీపీ మూడో జాబితాలో పేర్లు ఇవేనా? విడుదల సంక్రాంతికి వాయిదా..!

వైఎస్సార్సీపీ వరుసగా చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల పరంపరలో భాగంగా మూడో జాబితా నిన్న రాత్రి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఇది కాస్తా వాయిదా పడిపోయింది. అమావాస్యకు ముందు ఈ జాబితా విడుదల చేయకూడదని వచ్చిన సూచనలతో అధినేత దీన్ని వాయిదా వేశారు. ఈ జాబితాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ జాబితాలో కొన్ని పేర్లపై క్లారిటీ లేకపోవడంతో వాయిదా వేశారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది.

 

మరోవైపు వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల మూడో జాబితా విడుదల వాయిదా పడినా.. అందులో ఉన్న పేర్లు మాత్రం సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. ఇందులో కనిపిస్తున్న పేర్లన్నీ తాజాగా సీఎం జగన్ ను భేటీ అయి చర్చలు జరిపిన వారే కావడంతో దాదాపుగా ఇవే పేర్లు జాబితాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల మార్పులు కూడా ఉన్నాయి. దీంతో ఈ జాబితా ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాజా లిస్ట్ లో వైసీపీ ఎంపీ అభ్యర్ధుల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. వీరిలో కర్నూలు ఎంపీగా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపిక చేశారు. అలాగే రాజమండ్రి ఎంపీగా వీవీ వినాయక్ ను ఎంచుకున్నారు. విజయనగరం ఎంపీగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమ శెట్టి సునీల్ నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు ఆలీ పేర్లు ఉన్నాయి.

 

అలాగే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్, అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కిలారు పద్మ, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ఉన్నాయి.

 

ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో చింతలపూడికి కె.విజయరాజు, ఆలూరుకు విరూపాక్షి, గూడూరుకు మేరుగ మురళి, చిత్తూరుకు విజయఆనంద్ రెడ్డి, మార్కాపురం జె వెంకట్రావు, నందికొట్కూరుకు గంగాధర్, పెందుర్తి నుంచి అదీప్ రాజ్, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నెల్లూరుకు కృపాలక్ష్మి, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, మడకశిరలో శుభ కుమార్ ఉన్నారు. అలాగే సంక్రాంతి తర్వాత కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది

Posted Under AP
Editor