ఆదిత్య ఎల్1 సూర్యుడికి సమీపానికి చేరిన వేళ..

సూర్యుడిపై అధ్యయనాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తన గమ్యస్థానానికి చేరింది. ప్రయోగించిన తేదీ నుంచి 126వ రోజున నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకుంది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్ 1 శాటిలైట్‌ను విజయవంతంగా లాగ్రాంజ్ పాయింట్‌లో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది.

 

గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్1 శాటిలైట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్షే ప్రయోగ కేంద్రం నుంచి ఆదిత్య శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ- సీ57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

 

ఈ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆదిత్య ఎల్1 శాటిలైట్‌.. సూర్యుడి హ్యాలో ఆర్బిట్‌లో ప్రవేశించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లాగ్రాంజ్ పాయింట్. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి మొత్తంగా ఏడు రకాల పేలోడ్స్‌ను పంపించారు శాస్త్రవేత్తలు.

 

విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో-ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హై-ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.. ఈ నాలుగూ రిమోట్ సెన్సింగ్‌తో పని చేస్తాయి. మిగిలిన మూడు ఇన్-సైటు పేలోడ్స్.

 

ఇందులో ఆదిత్య సోలార్ విండ్ పర్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్స్డ్ ట్రై-యాక్సియల్ హై రిజాల్యూషన్ డిజిటల్ మేగ్నెటోమీటర్స్ ఉన్నాయి. తొలి నాలుగు పేలోడ్స్.. ఇదివరకే యాక్టివేట్ అయ్యాయి. సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) సూర్యుడిని అతి సమీపం నుంచి కొన్ని ఫొటోలను తీసింది.

 

ఈ శాటిలైట్ గమ్యస్థానానికి చేరుకోవడం పట్ల ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. శాటిలైట్ పనితీరు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆదిత్య ఎల్1 సుదీర్ఘ ప్రయాణం ముగింపు సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. లిఫ్ట్-ఆఫ్ నుంచి ఇప్పటి వరకు 126 రోజులు ఇది ప్రయాణించిందని, ఊహించినట్లే విజయవంతంగా దీన్ని ఇంజెక్ట్ చేయగలిగామని అన్నారు.

 

నిర్దేశిత స్థలంలో ఉందా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉందని, ఇందులో ఏవైనా కొన్ని కరెక్షన్ చేయాల్సి రావొచ్చని సోమనాథ్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి రాకపోవచ్చని అన్నారు. మాగ్నెటోమీటర్స్, పర్టికల్స్, ఎక్స్‌రే.. వంటి పేలోడ్స్ ద్వారా సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన కిరణాలపై అధ్యయనం చేయవచ్చని చెప్పారు.

 

కనీసం అయిదు సంవత్సరాల పాటు ఈ శాటిలైట్ తన పనితీరును కొనసాగిస్తుందని సోమనాథ్ స్పష్టం చేశారు. శాటిలైట్ నుంచి అందిన కొన్ని ఫొటోలను ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారాయన. సాంకేతికపరమైన డేటా అందిన తరువాత విశ్లేషణలు చేపడతామని, ఈ డేటా కోసం ఎదురు చూస్తోన్నామని చెప్పారు.

Editor