తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నెలరోజులైనా కాకముందే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఇప్పటికే ఒత్తిడి తెస్తున్న బీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్ 420హామీల పేరుతో ఒక బుక్ లెట్ ను విడుదల చేసింది.
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి మోసపూరిత హామీలను ఇచ్చిందని పేర్కొంది. ఇష్టారీతిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేసే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ఆ బుక్ లెట్లో విమర్శించింది. ఎన్నికల్లో గెలుపు కోసమే కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
తమ హామీల అమలులో జాప్యాన్ని కాంగ్రెస్‌కు గుర్తు చేసేందుకు పార్టీ బుక్‌లెట్‌ను విడుదల చేసిందని బీఆర్‌ఎస్ పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో, ప్రకటనల ద్వారా వందలాది హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు కేవలం ఆరు హామీల గురించే మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ పేర్కొంది. మొత్తం 420 హామీలు బుక్‌లెట్‌లో సంకలనం చేయబడ్డాయని పేర్కొంది.
కాంగ్రెస్ 420 పార్టీ అని, అందుకే 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడింది. ప్రజలను మోసం చెయ్యటంలో భాగంగానే హామీల అమలులో జాప్యం చేస్తుందని ఆరోపించింది. తెలంగాణా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన లోక్ సభ ఎన్నికలు రాక ముందే ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తుంది.అంతేకాదు ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రం ప్రతులను ఆ పార్టీ నేతలకు అందించి, కేసీఆర్ గత పదేళ్ళ కాలంలో చేసిన అభివృద్ధిని తెలిపి, కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో జాప్యంపై ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తుంది.
