గోదావరి టీడీపీ సీనియర్లకు సీట్లు గల్లంతే – పవన్ లిస్టు రెడీ, జాబితాలో..!!

ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాల్లో సీట్లు కీలకం. ఈ సారి గోదావరి జిల్లాల్లో తన సత్తా చాటాలనేది పవన్ లక్ష్యంగా స్పష్టం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లలో తన పార్టీ అభ్యర్దులను బరిలోకి దింపేందుకు పవన్ సిద్దమయ్యారు. ఇప్పపటికే 15 సీట్లు తమకు కేటాయించాలని జాబితా రెడీ చేసారు. దీంతో, టీడీపీ సీనియర్లకు పవన్ నిర్ణయాలు టెన్షన్ పెంచుతున్నాయి. పవన్ జాబితా పైన ఉత్కంఠ పెరుగుతోంది.

 

గోదావరి రాజకీయం : ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే ఆ పార్టీకే అధికారం దక్కనుంది. గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 స్థానాల్లో పవన్ తన అభ్యర్దులను ఎక్కడెక్కడ బరిలోకి దింపాలనే దాని పైన కసరత్తు వేగం పెంచారు. కాకినాడ కేంద్రంగా మూడు రోజుల పాటు నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో సమీక్షలు చేసారు. కాకినాడ సిటీలో ఈ సారి గెలుపు పవన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని గెలవనీయనని పవన్ శపథం చేసారు. ఈ సారి అవసరమైతే తాను కాకినాడ నుంచి బరిలో నిలచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడలో క్షేత్ర స్థాయిలో కమిటీల ఏర్పాటు, సంస్థాగతంగా బాధ్యతల కేటాయింపులో నిర్లక్ష్యం పైన స్థానికుల నాయకత్వం పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

15 స్థానాలపై పవన్ గురి : ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో 15 స్థానాలు తమకు ఇవ్వాలని..ఇతర జిల్లాల్లో అవకాశం మేర సర్దుబాటు చేయాలని..మొత్తం 40 సీట్లు తగ్గటానికి లేదని పవన్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ 40 సీట్లు ఇస్తుందని పార్టీ నేతలతో చెబుతున్నట్లు సమాచారం. ప్రధానంగా కాకినాడ, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ సీట్ల జనసేన కోరుతోంది. కాకినాడ , మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు కేటాయించే ఛాన్స్ ఉంది. కాకినాడ అభ్యర్దిని సైతం పవన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో 15 స్థానాలు కోరుతుండటంతో టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది. తాజాగా గోదావరి టీడీపీ నేతలు పవన్ తో సమావేశమయ్యారు. అందులోనూ ఎవరికి సీట్లు వచ్చినా రెండు పార్టీలు సమన్వయంతో పని చేయాలని పవన్ సూచించారు. పొత్తు తమకు కలిసి వస్తుందని అంచనా వేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఆ పొత్తుతో అసలు సీట్లే కోల్పోయే పరిస్థితి మింగుడు పడటం లేదు.

 

ఎవరికి ఏ సీట్లు దక్కేను : దీంతో, తమ పార్టీలో పరిణామాల కంటే జనసేన ఏ స్థానాలు కోరుతుందనేది తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతలు టీడీపీ కంటే జనసేన లో చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పాటుగా గోదావరి జిల్లాల్లో టీడీపీ కంటే జనసేన ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పవన్ పట్టు బిగిస్తున్నారు. పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, భీమవరం, తణుకు, తాడేపల్లి గూడెం, నర్సాపురం, ఏలూరు వంటి సీట్లు ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కవ ఓట్లు వచ్చాయో వాటిని తిరిగి పొత్తులో దక్కించకోవాలనేది వ్యూహంగా తెలుస్తోంది. దీంతో…పొత్తులో ఎవరికి ఏ స్థానం దక్కుతుందనే ఉత్కంఠ ఇప్పుడు టీడీపీ సీనియర్లలో పెరిగిపోతోంది.

Posted Under AP
Editor