ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ఏపీలో పెన్షన్ పెంపు అమలు చేయనుంది. కొత్త సంవత్సరంలో పథకాల అమలు విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ పెంపుతో పాటుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు..వరుసగా పథకాల అమలుకు షెడ్యూల్ ఖరారు చేసారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ముఖ్యమంత్రి పాలనా పరంగా..పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొత్త వరాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు.
ఎన్నికల రోడ్ మ్యాప్: ముఖ్యమంత్రి జగన్ ఇక ఎన్నికల రోడ్ మ్యాప్ సిద్దం చేసారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే పెన్షన్ రూ 3వేలకు పెంపు అమలుకు నిర్ణయించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.3వేలు అందనుంది. నేటి నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 3న కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి అధికారికంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు.
2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 2వేల పెన్షన్ ను దశల వారీగా పెంచుతూ నేటి నుంచి రూ 3వేలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 66.34 లక్షల మందికి నెలకు రూ 1,968 కోట్లు మేర లబ్ది జరగనుంది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు వేళ పెన్షనర్ల సంఖ్య 39 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ మొత్తం 66.34 లక్షలకు చేరింది.
పెన్షన్ రూ 3 వేలకు పెంపు: 2014-2019 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం పెన్షన్ల కోసం సగటున రూ 400 కోట్లు నెలకు ఖర్చు చేసింది. ఈ నెల నుంచి ఏపీ ప్రభుత్వం దాదాపు రూ 1,968 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న 1,17,161 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. ఈ నెల నుంచి వీరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.
ఇక, ఇదే నెలలో 19వ తేదీన విజయవాడ కేంద్రంగా సీఎం జగన్ 125 అడుగులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని నలుమూల నుంచి అందరూ వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆసరా – చేయూత: జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ ఆసరా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద నాలుగో విడదల నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలకు రూ 6,400 కోట్ల మేర లబ్ది జరగనుంది. మూడు విడతలుగా ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ 19,195 కోట్లు పంపిణీ చేసారు. మొత్తంగా ఈ ఒక్క పథకం కింద రూ 25,570 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫిబ్రవరి నెలలో 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం నిర్వహణకు నిర్ణయించారు.
45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందనున్నారు. ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఖర్చు చేసారు. దీంతో, ఎన్నికల ఏడాది తొలి రెండు నెలల్లోనే సంక్షేమ పథకాల అమల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
