ఏపీలో వైసీపీ స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. కాకినాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన.. కాసేపటికే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వంశీ రాకను పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
గతంలో ప్రజారాజ్యం యువజన విభాగం యువరాజ్యంలో పనిచేసిన వంశీకృష్ణ యాదవ్.. అనంతరం కాంగ్రెస్, వైసీపీల్లో పనిచేశారు. ఇవాళ తిరిగి జనసేనలోకి రావడం సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉందన్నారు.
వైసీపీ పెట్టకముందు నుంచీ నేటి వరకూ ఆ పార్టీలో ఉంటూ ఇవాళ తాను పవన్ సమక్షంలో జనసేన పార్టీలోకి వచ్చినట్లు వంశీ తెలిపారు. గతంలో పవన్ అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో చేరానని, ఆ పార్టీ ఆవిర్భావం ముందునుంచీ తనకు అనుబంధం ఉందన్నారు. జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్లే ఉందని, పార్టీ మారానన్న భావన లేదన్నారు. వైసీపీకి ఇవాళ రాజీనామా చేస్తానన్నారు.
జనసేనలో వంశీకృష్ణ చేరికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయనతో తనది పాత అనుబంధమన్నారు. తిరిగి ఆయన ఇవాళ సొంత గూటికి వచ్చారన్నారు. వంశీ ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో అందుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి బలమైన వ్యక్తులు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. త్వరలో ఏపీ భవిష్యత్తును నిర్దేశించి ఎన్నికలు రాబోతున్నాయని పవన్ తెలిపారు. ఏపీ భవిష్యత్తు చాలా ముఖ్యమని, జనసేన చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, అందులో వంశీకృష్ణది చాలా కీలక భూమిక ఉండాలన్నారు.
గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవి ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు. జనసేనలో చేరాక ఆయనకు పవన్ గతంలో పోటీ చేసిన గాజువాక సీటు కేటాయించే అవకాశం ఉంది.
