కొత్త రేషన్ కార్డులు, రైతుబంధు అమలుపై రేవంత్ కీలక ప్రకటన..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్నిసీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పించేలా వెసులుబాటు కల్పించారు. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు.

 

దరఖాస్తు ఆవిష్కరణ: కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల అమలులో భాగంగా ముందుగా దరఖాస్తుల స్వీకరణకు కార్యాచరణ ఖరారు చేసింది. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు బంధు సీలింగ్ పైన చర్చ జరుగుతున్న వేళ క్లారిటీ ఇచ్చారు. సీలింగ్ పైన అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చెప్పిన విధంగా ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు.

l

టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు రాజీనామా చేసారని..వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉందని వివరించారు. రాష్ట్రపతి అనుమతి కోరిన గవర్నర్ వాటిని ఆమోదించిన తరువాత కొత్త కమిషన్ సభ్యుల నియామకం జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ప్రజా పాలన ద్వారా గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలు కానుందని సీఎం వివరించారు.

 

మాట నిలబెట్టుకుంటాం: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిందని గుర్తు చేసారు. ప్రజలకు పదేళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదని విమర్శించారు. ప్రజావాణికి వస్తున్న స్పందనే ఆ విషయం చెబుతోందన్నారు. ప్రజావాణిలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 

ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకెళ్లమే ప్రజా పాలన ఉద్దేశమని వెల్లడించారు. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని చెప్పారు. నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వస్తుందని సీఎం రేవంత్‌ చెప్పారు.

 

అర్హులకు అందిస్తాం: గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తామన్నారు. మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుందని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

 

ఒక గ్రూపునకు ఎండీఓ, మరో గ్రూప్‌నకు ఎంఆర్‌వో బాధ్యత వహిస్తారని చెప్పుకొచ్చారు. ఎవరి కోసం ఎదురు చూడకండి.. ఎవరి దగ్గరకు వెళ్లకండి. అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులో ఉంటారు. జనవరి ఆరో తేదీ తర్వాత కూడా ఎంపీడీవో, ఎంఆర్‌వో ఆఫీసుల్లో అభయ హస్తం దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం రేవంత్ స్పష్టం చేసారు.

Editor