‘ఆడుదాం ఆంధ్ర’ వర్సెస్ ‘అడుగుదాం ఆంధ్ర’: ఏపీలో రాజకీయ రచ్చ!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకపక్క విలేజ్ వాలంటీర్లు సమ్మె ప్రకటించి తమకు ఇచ్చే గౌరవ వేతనం పెంచాలని, తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ప్రారంభమైన ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఇక మరోవైపు అంగన్వాడీలు తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె సైరన్ మోగించి, నేడు ఎమ్మెల్యేల ఇళ్ళ ముట్టడిని చేయనున్నామని ప్రకటించారు. ఇక ఇదే సమయంలో అడుగుదాం ఆంధ్ర అంటూ నిరుద్యోగుల తరుపున తెలుగుదేశం పార్టీ నిరసన బాట పట్టి రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది.

 

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగుల తరపున అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల కోసం నిరుద్యోగుల మాట’అనే పేరుతో రాష్ట్రంలో ఆందోళనకు ప్రతిపక్ష యువజననాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండరు ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చెయ్యాలని, ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల పట్ల విద్యార్థులలో ఆసక్తిని పెంపొందించాలని సీఎం జగన్ సంకల్పించారు.

 

ఇందులో భాగంగా గుంటూరులో నల్లపాడు లయోలా కాలేజికి’ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలు ప్రయత్నించారు. యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అడుగుదాం ఆంధ్ర అంటూ నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. కొన్నిచోట్ల నిరుద్యోగులు ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తం చేసే క్రమంలో, రోడ్లపై కబడ్డీ ఆడారు. మా ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూత కూస్తూ కబడ్డీ ఆడారు. అడుగుదాం ఆంధ్ర టీ షర్టులు ధరించి ఏపీ సీఎం జగన్ సభకు వెళ్లి తెలుగు యువత ఆందోళన చేపట్టింది.

 

ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తూ ప్రభుత్వం, అడుగుదాం ఆంధ్ర పేరుతో నిరుద్యోగుల గళాన్ని వినిపిస్తూ ప్రతిపక్షం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి.

Posted Under AP
Editor