పథకాల అమలుకు ఒకే దరఖాస్తు – రేషన్ కార్డులపై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించింది. అయిదు గ్యారెంటీల అమలు దిశగా లబ్దిదారుల ఎంపిక కోసం ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకొనే విధంగా నిర్ణయించారు. ప్రతీ ఇంటికి దరఖాస్తులు అందించి ఏ రోజు రావాలో సూచించనున్నారు.

 

కొత్త దరఖాస్తులు సిద్దం: కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభిస్తోంది. ఒక్కో గ్యారెంటీ కోసం వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. ఐదు గ్యారెంటీలు ఒకే దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న సదస్సుల కోసం ‘ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తు’ నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు.

 

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెండే పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకొని..పూర్తి చేసేలా దరఖాస్తును రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా.. రెండో పేజీలో ప్రభుత్వ అభయ హస్తం గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో ప్రొఫార్మా తయారుచేశారు.

 

పూర్తి వివరాల సేకరణ: గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత (దివ్యాంగులకు రూ. 6 వేలు, ఇతరులకు రూ. 4 వేలు) పథకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 

ఈ ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి గురువారం నుంచి ఆరో తేదీ దాకా ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రూ. 2,500 ఆర్థికసాయం, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ పథకం కోసం గ్యాస్‌ కనెక్షన్‌ నంబరు, గ్యాస్‌ సరఫరాచేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్‌ సిలిండర్ల సంఖ్య వివరాలను కోరారు.

రేపటి నుంచి ప్రారంభం: ఈ రెండు పేజీల దరఖాస్తును నింపి, సంతకంచేసి, ఫొటోను అంటించి… ఆధార్‌ కార్డు జిరాక్సు, రేషన్‌కార్డు జిరాక్సు కాపీలను జతచేయాల్సి ఉంటుంది. సెల్‌ నంబరు కూడా తప్పనిసరి రాయాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్‌ కార్డు లేకపోతే… కార్డులేదని రాసి దరఖాస్తులో రాయాలి. దరఖాస్తుదారు స్వీకరించాక అఽధికారులు రసీదు ఇస్తారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి దరఖాస్తులు స్వీకరిస్తారు.

 

ఎప్పటికప్పుడు దరఖాస్తుల వివరాలను క్రోడీకరించి ఆన్‌లైన్‌ చేస్తారు. కాగా గ్రామసభల ప్రారంభానికి ముందే ప్రొఫార్మాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జిల్లా, డివిజన్‌ స్థాయిలో నిర్వహించే సన్నాహక సమావేశాలు నేటితో పూర్తవుతున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరంలేదు.

Editor