తెలంగాణా రాష్ట్రంలో శాసన సభా స్థానాలకు ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎన్నికల్లో అనేక అంశాలు హైలైట్ గా నిలిచాయి. ఇక వాటిని గురించి తెలుసుకుందాం. ఈ సారి తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే పద్ధతిని మొదటి సారి ప్రవేశపెట్టారు.
హోం ఓటింగ్ లో భాగంగా ఇంతవరకు దాదాపు 27 వేల 178 మంది ఈ పద్ధతిలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 15 వేలమంది 80 ఏళ్ళు దాటిన వృద్ధులు, మిగిలినవారు 40 శాతం పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉన్నారు. ముందుగా నిర్ణీత పద్ధతిలో పేర్లను నమోదు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి పోలింగు సిబ్బంది వారి ఇంటి వద్దనే ఓటు నమోదు చేశారు.
శాసనసభ ఎన్నికలలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికలను స్వేచ్చగా, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు గాను 45 వేల మంది పోలీసు సిబ్బందితో పాటు, 3వేల మంది ఇతర విభాగాల వారినీ, 50 కంపెనీల రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళాలను, మరో 375 కంపెనీల కేంద్రీయ సాయుధ బలగాలనూ రంగంలోకి దించారు.
వీరు కాక, దాదాపు 24 వేల మంది హోం గార్డులను పొరుగు రాష్ట్రాల నుంచీ పిలిపించారు. ఈ సారి 2 లక్షల 8 వేల మంది ఈ సారి పోలింగు విధుల్లో ఉన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ప్రతి పోలింగు కేంద్రం వద్ద ఒక చక్రాల కుర్చీని దివ్యాంగుల కోసం సిద్ధంగా ఉంచారు. సహాయకులు కూడా అక్కడ యూనిఫాంలో అందుబాటులో ఉంటారు.
ఇంటి నుంచి పోలింగు స్టేషన్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్ధులు , దివ్యాంగులకు అధికారులు వాహన సదుపాయాన్ని కల్పించారు. ఓటరు స్లిప్పులను కూడా ఈ సారి బ్రెయిలీ లిపిలో ముద్రించారు. ఇలాంటి బ్రెయిలీ ఓటరు స్లిప్పులను దాదాపు 77 వేల స్లిపులను పంపిణీ చేశారు. బ్రెయిలీలో ముదరించిన ఓటరు గైడును, డమ్మీ బ్యాలట్ పేపరును కూడా అధికారులు పంపిణీ చేశారు. ఈసారి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కొన్ని ఎక్కువ అదనపు సౌకర్యాలను ఎన్నికల సంఘం కల్పించింది.
