Latest Posts

హాట్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రముఖ నటుడు, కమేడియన్ మాథ్యూ పెర్రీ (Matthew Perry) కన్ను మూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. అవివాహితుడు. లాస్ ఏంజిలిస్‌లోని తన ఇంట్లో హాట్ టబ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.

హాట్ టబ్‌లో నిర్జీవంగా ఉన్న మాథ్యూ పెర్రీని చూసిన ఆయన అసిస్టెంట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

1969 ఆగస్టు 19వ తేదీన మస్సాచుసెట్స్‌లోని మిలియమ్స్ టౌన్‌లో జన్మించారు. కెనడాలోని ఒట్టావాలోని రాక్‌క్లిఫ్ పార్క్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అతని క్లాస్‌మేట్. పెర్రీ తల్లి సుజాన్నె మారిసన్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. అప్పటి కెనడా ప్రధాని పియర్రె ట్రుడో వద్ద ప్రెస్ సెక్రెటరీగా పని చేశారు.

చదువు పూర్తయిన తరువాత లాస్ ఏంజిలిస్‌లో స్థిరపడ్డారు. సినిమా రంగం వైపు అడుగులు వేశారు. హాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు వేశారు. టెలివిజన్ సిట్ కామ్ షో ఫ్రెండ్స్ (Friends) అతని దశను మార్చేసింది. ఈ సిరీస్‌లో చండ్లేర్ బింగ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు.

234 ఎపిసోడ్స్ ఉన్న ఈ షో మొత్తానికీ అతను హైలైట్‌గా నిలిచాడు. దీనితో అతనికి టీవీ షోల్లో అనేక అవకాశాలు వచ్చాయి. బాయ్స్ విల్ బి బాయ్స్, గ్రోయింగ్ పెయిన్స్, సిల్వర్ స్పూన్, ఛార్లెస్ ఇన్ ఛార్జ్, సిడ్నీ, బేవర్లీ హిల్స్ 90210, హోమ్ ఫ్రీ, అల్లీ మెక్‌బీల్, ది వెస్ట్ వింగ్, స్క్రబ్స్, గో ఆన్, ద ఆడ్ కపుల్.. ఇలా పలు సీరియల్స్‌లల్లో నటించారు.

మాథ్యూ పెర్రీ అవివాహితుడు. నటి మోలీ హర్ట్‌విజ్‌తో కొద్ది రోజులు సహజీవనం చేశారు గానీ అది బ్రేకప్ అయింది. లాస్ ఏంజిలిస్‌లో ఒంటరిగా నివసిస్తోన్నారు. అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం తన నివాసంలో హాట్ టబ్‌లో నిర్జీవంగా కనిపించారు. మృతదేహాన్ని చూసిన ఆయన వ్యక్తిగత కార్యదర్శి 4:07 నిమిషాలకు లాస్ ఏంజిలిస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతికి కారణాలు ఇంకా తెలియరావట్లేదని, ఈ దిశగా దర్యాప్తు సాగిస్తోన్నామని లాస్ ఏంజిలిస్ షెరిఫ్ తెలిపారు. ఎలాంటి ఫౌల్ ప్లే కనిపించలేదని పేర్కొన్నారు.

YES9 TV