హైదరాబాద్: టాలీవుడ్‌లో మచ్ అవైటెడ్ మూవీ- టైగర్ నాగేశ్వర రావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణుదేశాయ్, జిషూ సేన్ గుప్తా, మురళీ శర్మ..
ఇతర కీలక పాత్రల్లో నటించారు. వంశీ దర్శకుడు. దసరా పండగను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియాడికల్ మూవీని అభిషేక్ పిక్చర్స్ పతాకం కింద అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 70వ దశకంలో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్టువర్ట్‌పురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగేశ్వర రావు క్యారెక్టర్‌లో రవితేజ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తోన్నాడు.
విడుదలకు సిద్ధమైన ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా యూనిట్‌లో కలకలం చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రొడక్షన్ కార్యాలయంపై ఆదాయపు పన్ను/వస్తు సేవా పన్ను విభాగాల అధికారులు మెరుపుదాడికి దిగారు. హైదరాబాద్‌లో గల ప్రొడక్షన్ ఆఫీస్, నిర్మాత కార్యాలయం, నివాసాలపైనా ఏకకాలంలో ఈ దాడులు ఆరంభమైనట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు, పక్కా సమాచారం అందిన నేపథ్యంలో ఈ రెండు విభాగాల అధికారులు ఈ దాడులు చేపట్టారనే ప్రచారం విస్తృతంగా ఉంది. దీనిపై చిత్రం యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐటీ/జీఎస్టీ అధికారులు ప్రకటన రూపంలో వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఐటీ/జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇతర సినిమాల ప్రొడక్షన్ కార్యాలయాల్లో కలకలం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
