అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
అరెస్టయినప్పటి నుంచి చంద్రబాబు బెయిల్, క్వాష్ పిటీషన్లపై పోరాటం చేస్తోన్నారు. ప్రస్తుతం ఈ క్వాష్ పిటీషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇవ్వాళ కూడా విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో- బెయిల్ కోసం ఇదివరకు దాఖలు చేసుకున్న పిటీషన్‌ను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే.
దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీధర్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ అక్రమం అంటూ లంచ్ మోషన్ పిటీషన్‌ను దాఖలు చేశారు. 17ఏ అంశాన్ని ఆయన ఇందులో పొందుపరిచారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని పిటీషన్‌లో పేర్కొన్నారు.
తాజాగా ఈ లంచ్ మోషన్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం విచారణ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లను ఏపీ హైకోర్టు సోమవారమే కొట్టేసిన విషయం తెలిసిందే. వాటన్నింటినీ డిస్మిస్ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్ మార్పు, అంగళ్లు వద్ద పోలీసులపై దాడికి పాల్పడటం, వారిని గాయపర్చడం, వాహనాలను తగులబెట్టడం..ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలోనూ ముందస్తు బెయిల్ దక్కలేదు చంద్రబాబుకు.
