అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక పరిణామం

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అక్రమాల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం తర్వాత వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తున్నట్లు సీఐడీ ఇవాళ ఏసీబీ కోర్టుకు సమాచారం అందించింది. దీంతో ఈ వ్యవహారం వెనుక ఏం జరిగిందన్న దానిపై చర్చ జరుగుతోంది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్ధతో పాటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు లబ్ది జరిగినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసును అదనపు ఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన స్ధానంలో ఇవాళ డీఎస్పీ విజయ్ భాస్కర్ ను నియమిస్తూ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రస్తుతం దర్యాప్తు కీలక దశలో ఉంది. అలాగే మాజీ మంత్రి నారా లోకేష్ ను ఈ కేసులో ఇవాళ కుంచనపల్లి సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. దర్యాప్తు అధికారి మార్పు వెనుక హైదరాబాద్ లో నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు కారణమా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియరాలేదు.

మరోవైపు చంద్రబాబు, లోకేష్, మాజీ మంత్రి నారాయణ నిందితులుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మంగా మారింది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన సన్నిహితులు భూముల కుంభకోణానికి పాల్పడినట్లు ఐదేళ్లుగా ఆరోపణలు చేస్తున్న వైసీపీ ఇప్పటివరకూ నిరూపించలేకపోయిందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆరోపణలు రుజువైతే వైసీపీ వాదన నిజమని తేలుతుంది. అప్పుడు ఎన్నికల్లో మూడు రాజధానుల చర్చను కూడా వైసీపీ బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం దొరుకుతుంది.

Posted Under AP
YES9 TV