టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తి మంత్రి రోజా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ సీరియస్ అయింది.
ఇదే అంశం పైన దర్శకుడు ఆర్జీవి స్పందించారు. మహిళా సంఘాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ నేతల్లో ఫ్రస్టేషన్ ఎక్కువైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మంత్రి రోజా పైన మాజీ మంత్రిగా పని చేసిన సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు మండి పడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో నిస్పృహ, నిస్తేజంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో సీనియర్లు మౌనంగా ఉంటున్నారు. ఇదే సమయంలో మరి కొందరు పార్టీ నాయకత్వం దృష్టిలో పడేందుకు స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రిగా ఉన్న మహిళా నేత పైన మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యల పైన మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. బాలకృష్ణ ను విమర్శిస్తావా అంటూ మంత్రి రోజా పైన బండారు అనుచిత వ్యాఖ్యలు చేసారు.
బండారు చేసిన వ్యాఖ్యల పైన దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను ఉద్దేశించి చేసిన ట్వీట్ లో ఈ అంశాన్ని ప్రశ్నించారు. స్త్రీలను అవమానించేలా మంత్రి రోజా గురించి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను వివరించారు. మంత్రి హోదాలో ఉన్న ఒక మహిళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటని నిలదీసారు. మీ కమిటీ ఏం చేస్తున్నట్లని ఆర్జీవి ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే, ఆర్జీవి ట్వీట్ తరువాత మహిళా కమిషన్ స్పందించినట్లు సమాచారం. బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేయాలని డీజీపీని ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరినట్లు తెలుస్తోంది.
