తెలంగాణ నయాగరాగా గుర్తింపు పొందిన బొగత జలపాతం జలకళతో తొణికిసలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో బొగత పరవళ్ళు తొక్కుతోంది. బొగత జలపాతం అందాలను, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
నిండు కుండలా మారి కొత్త అందాలతో, జల సవ్వడితో పర్యాటకుల మనసులకు ఆహ్లాదాన్ని అందిస్తున్న బొగత జలపాతం అందాలు ప్రతి ఒక్కరిని బొగత జలపాతం వద్దకు వెళ్ళేలా చేస్తున్నాయి.
బొగత అందాలు ఉరుకుల పరుగుల జీవితంలో అలసిన మనసును రిలాక్స్ చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ములుగు జిల్లా పర్యాటకులకు రారమ్మని స్వాగతం పలుకుతుంది. ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సు, సమ్మక్క సారలమ్మలు ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు టూరిస్ట్ లకు ఆతిధ్యం ఇస్తున్నాయి. ఈ సీజన్లో బొగత పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది.
ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ప్రతి ఒక్కరు బొగత అందాలను చూడడానికే ఇక్కడికి వస్తూ ఉంటారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి వద్ద బొగత జలపాతం, నయాగరా ఫాల్స్ లా కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం పెరిగింది. వరద ఉదృతి విపరీతంగా పెరగడంతో బొగత జలపాతం పరవళ్ళు తొక్కుతుంది.
దీంతో మహోగ్రరూపం దాలుస్తున్న బొగత జలపాతం వద్దకు సందర్శకులకు అనుమతించట్లేదు. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో సందర్శకులను జలపాతంలోకి దిగడానికి అనుమతించడం లేదు. ప్రస్తుతం బొగత జలపాతం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది.
