ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన ఎన్నారై సభ్యులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ తంతు అంతా జరిగింది. సభలో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఎన్నారై సభ్యులు కోట్లాట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తానా సభల్లో తెలుగు తమ్ముళ్ల కొట్లాట
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 23వ తానా సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సినీ హీరో బాలకృష్ణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభ కొనసాగుతున్న సమయంలో తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. రెండుగా చీలిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరగడం గమనార్హం. ఈ ఘటనతో కార్యక్రమానికి హాజరైన అతిథులు ఇబ్బంది పడ్డారు. తెలుగు తమ్ముళ్లు ఇలా కొట్టుకోవడంపై పలువు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కూడా రాజకీయాలు పేరుతో తన్నుకోవడం ఏంటని మండిపడుతున్నారు.
బండ్ల గణేష్ ఫైర్
సభలో జై ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన కొందరు…నినాదాలు చేసిన వారిపై దాడిచేశారు. పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ సభలో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు తెచ్చారని మరో వర్గం మండిపడింది. మాట, మాట అనుకున్న తెలుగు తమ్ముళ్లు.. తర్వాత తన్నులాటకు దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కోమటి జయరాం ఇరు వర్గాలను విడదీసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. తానా సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకోవడంపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ అంటూ ట్వీట్ చేశారు. తానా పరువు తీస్తున్నారని బండ్ల గణేష్ మండిపడ్డారు. తానాను నిర్మించడానికి ఎంతోమంది తెలుగు జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ ట్వీట్ ను నెటిజన్లు రీట్వీట్ చేస్తూ… అమెరికాలో కూడా మీరు తీరు మారదా? అని విమర్శిస్తున్నారు.
