హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. మూడు రోజులపాటు పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
ప్రస్తుతం ఆవర్తనం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని తెలిపింది.
గాలులు దిగువ స్థాయిలో పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీయడంతో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశాలున్నట్లు తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర అయితే తప్ప జనం బయటకు రావొద్దని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోని మొత్తం ఆరు జోన్లు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆ శాఖ తెలిపింది. జులై 3న నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాగా, గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ(TSDPS) ప్రకారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సోమవారం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 మీటర్ల మధ్యన కొనసాగుతున్నట్లు పేర్కొంది.
