విశాఖలో సంచలనం రేపిన రూ.2000 నోట్ల మార్పిడి దందాలో అరెస్టైన మహిళా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు స్వర్ణలతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్ ను కూడా సస్పెండ్ చేశారు. రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు విశ్రాంత నేవల్ అధికారులను స్వర్ణలత మోసం చేసిన సంగతి తెలిసిందే. బాధితులను బెదిరించి వారి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు ఆర్‌ఐ స్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డ్ శ్రీనివాసులను శుక్రవారం అరెస్టు చేశారు. కోర్టు వీరికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై తొడకొట్టి మరీ సవాల్ చేశారు ఆర్ఐ స్వర్ణలత… పైకి సిన్సియర్ గా కవరింగ్ ఇస్తూ అక్రమాల్లో ఆరితేరిపోయింది స్వర్ణలత. గతంలో స్వర్ణలతపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న విశాఖ అధికారులు ఆమె శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడి నుంచి విజయనగరం, అక్కడి మళ్లీ విశాఖపట్నం బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఆమె ఏఆర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ… హోంగార్డుల విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. హోంగార్డులు విధులు, డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు అని ఆమె పర్యవేక్షిస్తుంటారు. డ్యూటీలో లేకపోయినా పోలీసు వాహనంలో ఇద్దరిని వెంటపెట్టుకుని దందా చేస్తోందని తెలిసింది. వీరి టీమ్ లో హోంగార్డు శ్రీను అక్రమంగా సంపాదించడంలే ఆరితేరిపోయాడు. వారానికి ఒకసారి రిజిస్టర్‌లో అన్ని సంతకాలు పెట్టి డ్యూటీకి వెళ్లకుండా స్వర్ణలత ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాడు. అదేవిధంగా కానిస్టేబుల్ హేమసుందర్‌ను కూడా స్వర్ణలత తన టీమ్ లో పెట్టుకుంది. వీరి సాయంలో బెదిరింపులకు పాల్పడుతూ దందా చేస్తుంది.
